సీనియర్ నటుడు భానుచందర్ కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించి, ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం పొందారు. ఆయన తండ్రి దివంగత మాస్టర్ వేణు ఒకప్పుడు పేరుపొందిన సంగీత దర్శకుడు. తోడికోడళ్లు, రోజులు మారాయి, మాంగల్య బలం, సిరిసంపదలు, ప్రేమించి చూడు, వింత కాపురం, మేలుకొలుపు లాంటి పలు సినిమాలకు ఆయన రసగుళికల్లాంటి పలు పాటలను కంపోజ్ చేశారు. తనలాగే తన కుమారుడు భానుచందర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మాస్టర్ వేణు అనుకున్నారు. కానీ భానుచందర్ వాళ్లమ్మ మాత్రం తన కుమారుడు తెర వెనుక పనిచేసే టెక్నీషియన్ కాకుండా తెరముందు కనిపించే మంచి నటుడు కావాలని ఆశించారు. భానుచందర్ తల్లి ఆశయాన్ని నెరవేర్చారు.
అయితే నటుడు కాకముందు ఆయన గిటారిస్ట్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో మాస్టర్ వేణుకు అన్ని వాద్య పరికరాలపై మంచి పట్టు ఉంది కానీ, వెస్టర్న్ ఇన్‌స్ట్రుమెంట్ అయిన గిటార్‌పై పట్టు లేదు. అందుకని భానుచందర్ గిటార్ వాయించడం నేర్చుకున్నారు. "డాడీ నేను ఆర్.డి. బర్మన్ లాగా మోడరన్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతా" అనేవారు తండ్రితో.
దాంతో ఆయన కొడుకును ముంబైకి తీసుకెళ్లి ప్రసిద్ధ సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర చేర్పించారు. నౌషాద్ అసిస్టెంట్ గులామ్ అలీ అప్పుడు క్లాసిక్ ఫిల్మ్ 'పాకీజా'కు మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే ఆ సినిమా పూర్తికాకముందే ఆయన చనిపోతే, మిగతా వర్క్ నౌషాద్ పూర్తి చేశారు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరారు భానుచందర్. ఆ సినిమా రీరికార్డింగ్‌కు నౌషాద్ పియానో వాయిస్తుంటే, ఆయన పక్కన నిల్చొని గిటార్ వాయించేవారు భానుచందర్. ఆయన చెప్పిన నోట్స్ రాసేశారు.
అలా ఆరు నెలలు నౌషాద్ దగ్గర చేశాక, తిరిగి మద్రాస్ వచ్చేశారు. తండ్రి వేణు ట్రూప్‌లో గిటార్ వాయిస్తూ వచ్చారు. ఆ టైమ్‌లో ప్రఖ్యాత గాయకుడు పీబీ శ్రీనివాస్ బెంగళూరులో ఎక్కువగా సంగీత కచేరీలు చేసేవారు. ఆ ట్రూప్‌లో గిటారిస్ట్‌గా భానుచందర్‌ను పిలిచేవారు. అలా పీబీ శ్రీనివాస్ నిర్వహించిన పలు కచేరీల్లో భానుచందర్ గిటార్ వాయించారు. ఆ తర్వాత ఆయన గిటార్‌ను వదిలేసి ముఖానికి మేకప్ వేసుకొని నటుడిగా మారారు.